Pawan Kalyan : పవన్ దెబ్బకు కూటమి ప్రభుత్వం వణుకుతుందా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దెబ్బకు కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దెబ్బకు కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు. ఇక జనసేన ఎమ్మెల్యేల సంగతి సరేసరి. పవన్ కల్యాణ‌్ మార్పు తేవడానికే రాజకీయాల్లోకి వచ్చారు. అవినీతికి తావులేని పాలనను అందించాలని భావించి ఆయన జనసేన పార్టీని స్థాపిించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత పార్టీని స్థాపించినా తొందరపడి రాజకీయాలంటూ హడావిడి చేయలేదు. 2014 ఎన్నికల్లో బేషరతుగా బయట నుంచి టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. పవన్ కల్యాణ్ మద్దతుతోనే నాడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిందనడానికి మరో సందేహం లేదు.
పార్టీ స్థాపించినా....
పవన్ కల్యాణ్ 2014 - 2019 మధ్య కాలంలో రాజకీయాలను మొదలు పెట్టారు. అయితే పార్టీని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో విస్తరించలేదు. నేతలను పార్టీలోకి చేర్చుకోవడంలోనూ ఆచితూచి వ్యవహరించారు. అవినీతి మరకలున్న వారిని దరి చేరనివ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యునిస్టులతో కలసి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయినా లైట్ గానే తీసుకున్నారు తప్ప కుంగిపోలేదు. వెనక్కు తగ్గలేదు. 2024 ఎన్నికలకు రెడీ అయ్యారు. అప్పటికే రాష్ట్రంలో మానసికంగా దెబ్బతిన్న టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఆక్సిజన్ అందించారు. బీజేపీని కలుపుకుని కూటమి కట్టి గెలుపు బాట పట్టారు.
గ్రౌండ్ లెవెల్ రిపోర్టు...
ఈ ఎన్నికల్లోనూ కూటమి గెలవడానికి ప్రధాన కారణం పవన్ కల్యాణ‌్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. అందుకే చంద్రబాబు పవన్ కు ప్రత్యేక మైన గౌరవం ఇస్తారు. దీంతో పాటు ఆయనకు కేటాయించిన శాఖల్లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామం పవన్ కు చేరుతున్నాయి. వెంటనే ఆ సమాచారాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందిస్తున్నారట. వెంటనే సదరు మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ లు పీకుతున్నారట. గడచిన రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ నెట్ వర్క్ ను పెంచుకోవడంతో ఆయనకు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ సమాచారం అందుతుంది. అయితే ఎమ్మెల్యేలు చాలా వరకూ తమ అనుచరుల వత్తిడికి తలొగ్గి ఇసుక దందా వంటి వారికి తలూపుతున్నారట.
పారదర్శక పాలన...
తాను అవినీతి చేయడు. ఆ అవసరం కూడా పవన్ కల్యాణ్ కు లేదు. పారదర్శక పాలన అందించాలన్న ధ్యేయంతోనే ఆయన కూటమిని కూడగట్టారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించగలిగారు. ఈ ప్రభుత్వంలోనూ అదే జరిగితే తేడా ఏముందని ప్రజలు భావిస్తారు. అందుకే జనసైనికులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారన్న సమాచారంతో ఎమ్మెల్యేలు భయపడి పోతున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు కూడా అవినీతికి దూరంగా ఉండాలని పదే పదే నేతలకు వార్నింగ్ లు ఇస్తుండటంతో మంత్రుల నుంచి నేతల వరకూ తాము ఎన్నికల్లో ఖర్చు చేసింది ఎలా సంపాదించుకోవాలన్న ఆందోళనలో ఉన్నారు. పవన్ కల్యాణ్ మాత్రం తనకు క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చంద్రబాబుకు చేరవేస్తుండటంతో టీడీపీ నేతలు ఇదెక్కడి గోలరా బాబూ అంటూ తలలు పట్టుకుంటున్నారట.